సైబర్ నేర బాధితులకు వేగంగా న్యాయం – కామారెడ్డి జిల్లా పోలీసుల ప్రత్యేక శిక్షణ
GRM, MRM మాడ్యూళ్ల వినియోగంపై సైబర్ వారియర్స్‌కు అవగాహన
రూ.50,000 లోపు నగదు, కోర్టు లేకుండానే రికవరీ అవకాశం – ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:
సైబర్ నేరాల దర్యాప్తును మరింత సమర్థంగా నిర్వహించి, బాధితులకు వేగవంతమైన సేవలు అందించే లక్ష్యంతో కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు జిల్లా సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (D4C) ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సైబర్ వారియర్స్‌కు ఈ శిక్షణ ఇచ్చారు.
GRM, MRM మాడ్యూళ్లపై అవగాహన
ఈ సందర్భంగా గ్రీవెన్స్ రెడ్రెస్సల్ మాడ్యూల్ - GRM, మనీ రెస్టోరేషన్ మాడ్యూల్ - MRMల వినియోగం, విధివిధానాలు, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై సిబ్బందికి వివరించారు.
సైబర్ నేరాలతో సంబంధం లేకపోయినా బ్యాంకు ఖాతాలు లేదా నగదు ఫ్రీజ్ అయిన పౌరులు GRM పోర్టల్ ద్వారా వినతి సమర్పించవచ్చని తెలిపారు. దర్యాప్తు అధికారి బ్యాంకులతో సమన్వయం చేసి, నిబంధనల మేరకు అర్హుల ఖాతాలను డీ-ఫ్రీజ్ చేయడం లేదా ఫ్రీజ్ అయిన నగదును విడుదల చేయడం జరుగుతుందని వివరించారు.
సైబర్ మోసాలకు గురైన బాధితులకు కోల్పోయిన నగదును త్వరగా తిరిగి ఇప్పించేందుకు MRM మాడ్యూల్ కీలకంగా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ విధానం ద్వారా రూ.50,000 లోపు ఫ్రీజ్ అయిన మొత్తాన్ని కోర్టు ఉత్తర్వులు లేకుండానే, పరిశీలన అనంతరం బాధితులకు పునరుద్ధరించే అవకాశం ఉందని తెలిపారు. దీంతో బాధితులకు త్వరిత న్యాయంతో పాటు కోర్టు ప్రక్రియకు పట్టే సమయం కూడా తగ్గుతుందన్నారు.
ప్రజలకు సకాలంలో సేవలు అందించాలి – ఎస్పీ
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, సైబర్ వారియర్స్ GRM, MRM మాడ్యూళ్లను సమర్థంగా వినియోగించి ప్రజల వినతులను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. బ్యాంకులు, దర్యాప్తు అధికారులతో సమన్వయం పెంచి అర్హుల ఖాతాల డీ-ఫ్రీజ్, నగదు పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
GRM, MRM మాడ్యూళ్ల సమర్థ వినియోగం ద్వారా సైబర్ బాధితులకు సకాలంలో న్యాయం అందించడంతో పాటు పోలీసు సేవలను మరింత పారదర్శకంగా, ప్రజలకు చేరువగా తీసుకెళ్లవచ్చని, దీంతో పోలీసు శాఖపై ప్రజల విశ్వాసం పెరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు.

Post a Comment