Top News

Shabbir Ali | 12 ఎకరాల్లో వరి సాగు నిలిపి ఆయిల్ ఫామ్ ప్రారంభించిన సలహాదారు షబ్బీర్ అలీ

 రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయాలి

12 ఎకరాల్లో వరి సాగు నిలిపి ఆయిల్ ఫామ్ ప్రారంభించిన సలహాదారు షబ్బీర్ అలీ

నీటి వినియోగం తగ్గించి ఆదాయం పెంచుకోవాలని పిలుపు

కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్: 

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులు సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో 12 ఎకరాల వరి సాగును నిలిపివేసి ఆయిల్ ఫామ్ సాగును ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. రైతులకు కేవలం సూచనలు ఇవ్వడమే కాకుండా, తానే ముందుగా ఆచరించి చూపాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణ, నీటి వినియోగం తగ్గింపు, రైతుల ఆదాయం పెంపు కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తోందన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలకు భవిష్యత్తులో మంచి మార్కెట్, స్థిరమైన ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని వివరించారు.

ప్రస్తుతం వరి సాగులో నీటి వినియోగం అధికంగా ఉండటంతో పాటు ఉత్పత్తి వ్యయం కూడా పెరుగుతోందని అన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటిని ఆదా చేసే పంటల సాగుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆయిల్ ఫామ్ సాగు ద్వారా దీర్ఘకాలికంగా అధిక ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు.

రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల వైవిధ్యం పెంచుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు శాస్త్రీయ సలహాలు ఇస్తూ ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని కోరారు.





రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు అవసరమైన ప్రోత్సాహకాలు, సాంకేతిక సహకారం అందిస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ సూచనలను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం సాధించాలని ఆకాంక్షించారు.

రైతుల్లో విశ్వాసం పెంచడమే లక్ష్యంగా తన పొలంలోనే ముందుగా పంట మార్పు చేపట్టానని షబ్బీర్ అలీ తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆయిల్ ఫామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post