Top News

BRS Blood Donation | "రేవంత్ రక్త దాహర్తికి మా రక్త దానం"

"రేవంత్ రక్త దాహర్తికి మా రక్త దానం" - సిద్దిపేటలో BRS రక్తదాన శిబిరం

కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలంటూ 20 యూనిట్ల రక్తాన్ని సీఎం కార్యాలయానికి పంపిన BRS శ్రేణులు

(దాస శ్రీనివాస్/సిద్దిపేట బ్యూరో)  

రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో BRS పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో "రేవంత్ రక్త దాహర్తికి మా రక్త దానం" పేరుతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి, సేకరించిన 20 యూనిట్ల రక్తాన్ని సీఎం రేవంత్ రెడ్డికి పంపారు.

రైతుల పంట పొలాల్లో KCR, హరీష్ రావులను కోసి వాళ్ల రక్తం చల్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు BRS నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా BRS నాయకులు పాల సాయిరాం, ఎల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తమ రక్తంతో రైతుల కష్టాలు తీరతాయంటే రక్తం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. "ఇదిగో మా రక్తం నీకు పంపిస్తున్నాం... రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వు రేవంత్" అంటూ నినాదాలు చేశారు.

సీఎంకు పరిపాలన చేతకాక ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రైతులకు నీరు ఇవ్వాలని ప్రశ్నించినందుకు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడడం సరికాదని విమర్శించారు. ఈ రక్త ప్యాకెట్లను రేవంత్ రెడ్డి ఇంటికి పంపిస్తున్నామని, ఒకవేళ పొలాల్లో చల్లుకోవాలంటే కూడా చల్లుకోవచ్చని దుయ్యబట్టారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నాయకులపై అసందర్భ వ్యాఖ్యలు మానుకోవాలని, వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రైతన్నకు నీరందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో రైతుల పక్షాన BRS పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో BRS నాయకులు కొండం సంపత్ రెడ్డి, కాముని శ్రీనివాస్, కోల రమేష్ గౌడ్, గ్యాదరి రవీందర్, శ్రీకాంత్ గౌడ్, జంగిటి శ్రీనివాస్, సాయి ఈశ్వర్ గౌడ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.




Post a Comment

Previous Post Next Post