Top News

Police Arrested | కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు దొంగిలించిన నిందితుడు అరెస్ట్

కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు దొంగిలించిన నిందితుడు అరెస్ట్  

48 గంటల్లో కేసు ఛేదించిన ఎల్లారెడ్డి పోలీసులు – చోరీ సొత్తు పూర్తిగా స్వాధీనం

ఎల్లారెడ్డి: కల్లు తాగించి ఇద్దరు వృద్ధ మహిళలను మత్తులోకి నెట్టి బంగారం, వెండి ఆభరణాలు అపహరించిన నిందితుడిని ఎల్లారెడ్డి పోలీసులు 48 గంటల్లో అరెస్ట్ చేశారు. చోరీకి గురైన మొత్తం ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు.

ఘటన వివరాలు:  

తేది 11-07-2026న లింగారెడ్డిపేటలోని ఫిర్యాదుదారుడు తలారి సంగయ్య ఇంట్లో అతని తల్లి తలారి దుర్గవ్వ మరియు పక్కింటి మహిళ కుక్కల పోశవ్వ ఉన్నారు. ఈ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి "బెయిల్ పనిమీద వచ్చాను" అని చెప్పి ఇంట్లోకి ప్రవేశించాడు. వారికి కల్లు తాగించి, వారు అప్రమత్తంగా లేని సమయంలో దుర్గవ్వ మెడలోని సుమారు 12 గ్రాముల బంగారు గుండ్ల తాడును తెంచి, పోశవ్వ చేతికి ఉన్న సుమారు 40 గ్రాముల వెండి పట్టే కడెంను లాక్కొని పరారయ్యాడు.ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (ప్రెస్ మీట్ వీడియో 👇)



ప్రత్యేక బృందాలతో వేట:  

జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటయ్యాయి. బాధితుల వాంగ్మూలం, స్థానికుల సమాచారం, సీసీ కెమెరా ఫుటేజ్, పాత నేరస్తుల రికార్డులను విశ్లేషించారు.

విచారణలో నిందితుడు గతంలో బాన్సువాడ, ఎల్లారెడ్డి, లింగంపేట స్టేషన్ల పరిధిలో దొంగతనం కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లినట్లు తేలింది. బెయిల్‌పై విడుదలైన తర్వాత లింగారెడ్డిపేటలోని ఓ ఇంట్లో బీరువాలో విలువైన వస్తువులు ఉన్నాయనే సమాచారంతో వెళ్లగా, అక్కడ ఏమీ దొరకలేదు. దీంతో అక్కడి వృద్ధ మహిళలను టార్గెట్ చేసి ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

దొంగిలించిన ఆభరణాలను విక్రయించేందుకు ఎల్లారెడ్డిలోని బంగారు దుకాణాల వద్దకు వెళ్తుండగా, బాలాగౌడ్ ఫంక్షన్ హాల్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం అంగీకరించాడు.

నిందితుడి వివరాలు:  

పేరు: నీరుడి సాయిలు  

తండ్రి: బాలయ్య  

వయస్సు: 49 సంవత్సరాలు  

వృత్తి: కూలీ  

నివాసం: కొండాపూర్ గ్రామం, లింగంపేట మండలం

స్వాధీనం చేసుకున్న సొత్తు:  

1. 12 గ్రాముల బంగారు గుండ్ల తాడు  

2. 40 గ్రాముల వెండి పట్టే కడెం

నేర చరిత్ర:  

నిందితుడిపై ఎల్లారెడ్డి, బాన్సువాడ, లింగంపేట, నిజాంసాగర్, అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్లలో కలిపి 8 దొంగతనం కేసులు ఉన్నాయి. గతంలో పీడీ యాక్ట్ కింద దాదాపు ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాడు.నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎల్లారెడ్డి సీఐ డి. రాజారెడ్డి తెలిపారు.

ఎస్పీ ప్రశంస:  

కేవలం 48 గంటల్లో కేసును ఛేదించి, సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాలు, విశ్వసనీయ సమాచారాన్ని సమర్థవంతంగా ఉపయోగించిన దర్యాప్తు అధికారి సీఐ డి. రాజారెడ్డి, ఎస్‌ఐ ఎన్. రాజు, కానిస్టేబుళ్లు శ్యామ్, ఇద్రీస్, సంజీవ్, వసుందర్, విజయ్ లను జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు.

Post a Comment

Previous Post Next Post