🔹 రూ.4,600 నగదు, 3 మొబైల్ ఫోన్లు, 1 బైక్ స్వాధీనం
🔹 జూదం, బెట్టింగ్‌లపై ఉపేక్ష లేదు : జిల్లా ఎస్పీ
తెలంగాణ డైలీ న్యూస్, బిచ్కుంద : విశ్వసనీయ సమాచారం మేరకు బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్కల్ గ్రామంలో ఈరోజు బిచ్కుంద ఎస్‌ఐ రాజు తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.4,600 నగదు, మూడు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జూదం వల్ల కుటుంబాలు నాశనం : ఎస్పీ
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, జిల్లాలో జూదం, పేకాట, బెట్టింగ్, అక్రమ మద్యం, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతోందని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
"జూదం, బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలు వ్యక్తుల జీవితాలను నాశనం చేయడమే కాకుండా, కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితిని దెబ్బతీసి, సమాజంలో నేరాల పెరుగుదలకు దారితీస్తాయి" అని జిల్లా ఎస్పీ తెలిపారు.
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ఆర్థిక నష్టాలతో పాటు కుటుంబ కలహాలు, సామాజిక సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు.
ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి
జూదానికి బానిసై నిండు జీవితాలను నాశనం చేసుకోవద్దని, కష్టపడి సంపాదించే సరైన మార్గాన్ని ఎంచుకొని మీ భవిష్యత్తును, మీ కుటుంబ భవిష్యత్తును ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని జిల్లా ఎస్పీ సూచించారు.
జూదం, బెట్టింగ్ లేదా ఇతర అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా *డయల్-100*కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Post a Comment