Top News

Bakrid Festival | బక్రీద్‌కు కట్టుదిట్టమైన భద్రత : ఎస్పీ


బక్రీద్‌కు కట్టుదిట్టమైన భద్రత

24/7 కంట్రోల్ రూమ్

6 ప్రత్యేక చెక్‌పోస్టులు : ఎస్పీ రాజేష్ చంద్ర

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

 జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రజలకు తక్షణ సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను 24/7 ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపారు.

హెల్ప్‌లైన్ 8712686133కు సమాచారం ఇవ్వండి  

పండుగ సమయంలో అనుమానాస్పద ఘటనలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే జిల్లా పోలీస్ హెల్ప్‌లైన్ 8712686133 లేదా డయల్ 100కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. కంట్రోల్ రూమ్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు.

6 ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు  

జిల్లా వ్యాప్తంగా భద్రతను పటిష్టం చేసేందుకు ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో 6 ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. వీటిలో 24 గంటల పాటు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని ఎస్పీ వివరించారు.

చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చర్యలు తప్పవు  

వాహనాలను ఆపడం, తనిఖీలు చేసే అధికారం కేవలం ప్రభుత్వ విభాగాలకు మాత్రమే ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. వ్యక్తులు లేదా సంస్థలు స్వయంగా తనిఖీలకు దిగడం నిషేధమని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద విషయాలు గమనిస్తే స్వయంగా చర్యలకు పాల్పడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

విద్వేషపూరిత పోస్టులపై నిఘా  

సోషల్ మీడియాలో ద్వేషపూరిత, రెచ్చగొట్టే పోస్టులు, మత సామరస్యాన్ని దెబ్బతీసే వీడియోలు ప్రచారం చేసే వారిపై పోలీసు నిఘా ఉంటుందని ఎస్పీ తెలిపారు. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

పరస్పర గౌరవంతో పండుగ జరుపుకోవాలి  

జిల్లా ప్రజలందరూ సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలని ఎస్పీ రాజేష్ చంద్ర పిలుపునిచ్చారు. శాంతిని కాపాడేందుకు ప్రజలందరూ పోలీసులతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Post a Comment

Previous Post Next Post