నీట్ పేపర్ లీక్‌పై కామారెడ్డిలో కాంగ్రెస్ ఆందోళన
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని హెచ్చరిక
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ ఘటనపై కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఇందిరాగాంధీ చౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన
యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి చదువుతుంటే పేపర్ లీక్‌లతో వారి ఆశయాలు దెబ్బతింటున్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర వైఫల్యమే కారణమన్న నేతలు
నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలక పరీక్ష అని, అలాంటి పరీక్షలో పేపర్ లీక్ జరగడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని గుడుగుల శ్రీనివాస్ విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కఠిన చర్యలు తీసుకోవాలి: సందీప్
పట్టణ అధ్యక్షులు ఐరేని సందీప్ మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడుతుంటే కొందరు అక్రమాలకు పాల్పడి పరీక్షా వ్యవస్థను అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. పేపర్ లీక్‌ల వెనుక ఉన్న అసలు నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, పారదర్శక పరీక్షా విధానం అమలు చేయాలని కోరారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
నేతల హాజరు
ఈ కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ అధ్యక్షులు రాజా గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామ్ కుమార్, షేరు, సిద్దిక్, యూనుస్, కాళ్ల గణేష్, వడ్ల సురేష్, భరత్ టింకు, జమీల్, సుపియన్, హనుమాన్ల రవి, అనిల్, బషీర్, నిరంజన్, అనిరుద్ గౌడ్, పెద్ది శీను, రషీద్, కార్యాలయ కార్యదర్శి లక్కపతిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
=================================
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరు కానున్న డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతిపక్ష నేతల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో భాగంగా కామారెడ్డి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సైబర్ టవర్స్‌లోని సిట్ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసుల మేరకు గంప ప్రసాద్ సిట్ విచారణకు హాజరు కానున్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది.
ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక నేతలను సిట్ అధికారులు ప్రశ్నించగా, వివిధ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నాయకుల నుండి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకుడు గంప ప్రసాద్‌ను సిట్ విచారణకు పిలిచినట్లు సమాచారం.
ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలు, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన అంశాలపై గంప ప్రసాద్ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేయనున్నట్లు తెలిసింది.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ కార్యాలయంలో పిసిసి,రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఐరేని సందీప్ కుమార్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్ , చాట్ల రాజేశ్వర్ ,మరియు డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్ లక్క పత్తిని గంగాధర్, వడ్ల సురేష్ టింకు భరత్, ఆధ్వర్యంలో పత్రికా ప్రకటన విడుదల చేశారు.



Post a Comment